ఎక్కడ చూసినా.. ఏ రంగంలో చూసినా మహిళలకు ఆఫర్లు ఉంటాయి. పురుషులు మాత్రం ఆ ఆఫర్లు మాకెందుకు ఇవ్వట్లేదని ఫీల్ అవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే భారత రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. మహిళల కోసం ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్ ను తాను పొందాలనుకొని ఓ యువకుడు చివరకు బుక్ అయ్యాడు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్కడి మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పురుషులకు ఈ ఆఫర్ లేకపోవడంతో.. ఎలాగైనా బస్సులో ఉచితంగా ప్రయాణించాలనుకున్నాడు ఓ యువకుడు. అందుకు తగ్గట్టు లేడీ గెటప్ వేసి బస్సులో ప్రయాణించాలని ఉపాయం పన్నాడు.
అందులో భాగంగా తనను ఎవరు గుర్తు పట్టకుండా స్కార్ఫ్, మాస్కుతో మేనేజ్ చేద్దామని అనుకున్నాడు. కానీ.. అతని కదలికలు, నడక చూసి.. కండక్టరుకు అనుమానం వచ్చింది. దీంతో అంతా బట్టబయలైంది. అయితే.. మాస్కును తీసేందుకు మొదట నిరాకరించిన యువకుడు కండక్టర్ను క్షమాపణలు కోరాడు.
కండక్టర్ అతనిపై సీరియస్ కావడంతో చివరకు మాస్కును తొలగించాడు. అయితే.. దొరికిపోయిన తర్వాత కూడా అమ్మాయి గొంతుతోనే మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన అంతా ఆ కండక్టర్ వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇదే పోయే కాలంరా నీకు అంటూ పలువురు కామెంట్ లు పెడితే.. అతడు చేసిన పనికి ఇంకొందరు హాస్యంగా ఉందని నవ్వుకుంటున్నారు