ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిని దారుణంగా హత్య చేశారు.. వేటాడి.. వెంటాడి చంపేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కళ్లెదుటే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన హైదరాబాద్ లోని సురారం కాలనీలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీర్ బాగ్ పోలీసులు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్ పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన దేవరకొండ హరీష్(28) కుటుంబం ఆరు నెలల క్రితం సూరారంకాలనీకి షిఫ్ట్ అయ్యింది. DJ ఆపరేటర్ గా పని చేస్తున్న.. గత కొంతకాలంగా ఎల్లారెడ్డిగూడలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలిసి.. యువతి కుటుంబ సభ్యులు పద్ధతి మార్చుకోవాలంటూ హరీష్ ను బెదిరించారు. ఈ క్రమంలోనే 10 రోజుల క్రితం యువతిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు హరీష్.
దీంతో యువతి కుటుంబ సభ్యులు గత 10 రోజుల నుంచి హరీష్ కోసం వెతికారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. అనంతరం గత నెల 24వ తేదీన యువతి కుటుంబ సభ్యులు హరీష్ ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేశారు. ఆ తర్వాత మార్చి 1వ తేదీన హరీష్ తన సోదరి ఉంటున్న దూలపల్లి ప్రాంతానికి వెళ్లాడు.
యువతి కుటుంబ సభ్యులు రెక్కీ నిర్వహించి హరీష్ ను బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై దారుణంగా హత్య చేసి పారిపోయారు. హరీష్ ఫ్రెండ్ ద్వారా సమాచారం తెలుసుకున్న యువతి బంధువులు రెక్కీ నిర్వహించి చంపేశారు. అనంతరం యువతిని తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.