- బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవాలు..!
- గ్రీన్ ఛానల్ తో పోలీసుల సక్సెస్
రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ ఐన యువకుడు మరో ఎనిమిది మందికి తన అవయవాలను దానం చేసి పునర్జన్మ ప్రసాదించాడు.ఆ యువకుడి అవయవాలను గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చినకాకాని లోని ఎన్నారై జనరల్ ఆసుపత్రి నుంచి చెన్నై, గుంటూరు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్ణణానికి చెందిన ఎం.కోటేశ్వరరావు(27) పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు వివాహానికి హాజరయ్యేందుకు ద్విచక్రవాహనం పై వెళ్లారు.వెనుక కూర్చున్నఆయనను వారి వాహనం వెనుకనే వస్తున్నకారు ఢీకొంది. ఆ వెంటనే ఆయన కిందపడి పోయారు.తలకు తీవ్రగాయం అయింది.చికిత్స కోసం బంధువులు స్థానికంగా ఉన్నఆసుపత్రికి తరలించారు.అక్కడి నుంచి మెరుగైన చికిత్సనిమిత్తం ఎన్ఆర్ ఐ ఆసుపత్రికి అదే రోజు రాత్రికి తరలించారు.డాక్టర్లు మెరుగైన చికిత్సఅందించినా కోటేశ్వర రావు వైద్యానికి స్పందించలేదు.కోమాలోకి వెళ్ళిపోయాడు.దీంతో ఆసుపత్రిలోని న్యూరో సర్జన్ డాక్టర్ తోటకూర అమిత్ కుమార్ , న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సుస్మిత, ఐసియు ఇంచార్జి డాక్టర్ అమిత్ పాషా,సూపరింటిండెంట్ డాక్టర్ జి శ్రీనివాస్ తో కూడిన బృందం ఇంకా మెరుగైన చికిత్స ఏమి చేయాలో చర్చించింది.
ప్రమాదానికి గురైన యువకుడు కోమాలోకి వెళ్లిన నేపథ్యంలో అతని బ్రెయిన్ పని చేస్తుందో లేదో తెలుసుకునేందుకు అప్నియా పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్షను ఆరు గంటలకు ఓ మారు రెండు సార్లు నిర్వహించిన తరువాత ఆ యువకుని నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం తో బుధవారం రాత్రి బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు.బ్రెయిన్ డెడ్ ఐన వ్యక్తి తన అవయవాలను దానం చేయవచ్చని ఆసుపత్రి సిఈఓ వెంకట్,అవయవ మార్పిడి విభాగం డైరెక్టర్ మస్తాన్,సూపరింటిండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఆ యువకుడి తల్లి,సోదరుడు,సోదరి తదితరులకు వివరించారు. వారు పెద్ద మనసుతో తమ కుటుంబ సభ్యుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు.ఈ విషయాన్నిఆసుపత్రి వర్గాలు జీవన్దాన్ కు తెలియచేసాయి.
చెన్నై,గుంటూరు,ఎన్ఆర్ ఐ,అగర్వాల్ ఆసుపత్రుల నుంచి తమ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నరోగులకు అవయవాలు కావాలని వినతులు వచ్చాయి.వెంటనే స్పందించిన వైద్యులు అవయవాలు అందించేందుకు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు సమ్మతించారు. గురువారం మధ్యాహ్నం వాటిని ఆయా ఆసుపత్రులకు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు.చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రికి గుండె,అపోలో ఆసుపత్రికి ఊపిరితిత్తులు,కామాక్షి ఆసుపత్రికి కాలేయం(లివర్)అందించారు. వీటిని పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు.ఎన్ఆర్ ఐ ఆసుపత్రి నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఉన్న33 కిలోమీటర్ల దూరాన్ని 25 నిమిషాల్లో అవయాలతో కూడిన అంబులెన్సు చేరుకుంది. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వీటిని చెన్నైతరలించారు. కోటేశ్వర రావు ఒక కిడ్నీని గుంటూరు రమేష్ ఆసుపత్రికి,మరో కిడ్నీని ఆయన బ్రెయిన్ డెడ్ ఐన ఎన్ఆర్ఐ ఆసుపత్రిలోనే చికిత్సపొందుతున్న రోగికి అమర్చారు.రెండు కళ్ళను గుంటూరు అగర్వాల్ ఆసుపత్రికి అందించారు.