ప్రస్తుతం ఉన్న రోజుల్లో సోషల్ మీడియాలో కేటుగాళ్లకేం కొదవ లేదు. కొందరి అమాయకత్వాన్ని, బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకొని మోసాలకు పాల్పడుతున్నారు. మరి కొందరు ఎర వేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి సోషల్ మీడియా మోసం ఒకటి విజయవాడలో వెలుగులోకి వచ్చింది.
ఓ యువతికి సోషల్ మీడియా వేదికగా ఆశపెట్టిన ఓ యువకుడు..ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. సినిమా ఆడిషన్స్ అంటూ పిలిచాడు. ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే… సినిమా ఆడిషన్స్ పేరుతో మైనర్ బాలిక పై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీసెంట్ రోడ్ లోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న సాయి తేజ..విజయవాడకు చెందిన యువతికి సినిమాలో అవకాశం అంటూ ఎర వేశాడు. సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని నమ్మబలికాడు..తన ప్లాన్ ప్రకారం..యువతిని లాడ్జికి రప్పించాడు. లాడ్జిలో ఆ యువతి పై అత్యాచారయత్నం చేశాడు. అయితే అతని నుంచి తప్పించుకున్న యువతి ఇంటికెళ్లి తల్లికి జరిగిన విషయం చెప్పింది.
తర్వాత యువతి, ఆమె తల్లి ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎవరినీ పడితే వారిని నమ్మి..మోసపోవద్దు అని సూచిస్తున్నారు పోలీసులు.