భారతదేశంలోని ప్రతి పౌరుడికి బ్యాంకింగ్, ఆర్థిక, ప్రభుత్వ తదితర సేవలను పొందడానికి ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైనదిగా మారింది. ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ఆధార్ కార్డు భారతీయ పౌరులతో పాటు ప్రవాస భారతీయులు (NRI)లకు కూడా అందుబాటులో ఉంటుంది. గతంలో ఎన్నారైలు ఆధార్ కావాలంటే కొంతకాలం వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ఇకపై మాత్రం ఎన్ఆర్ఐలకు ఆ ఇబ్బంది ఉండదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 2020లో భారతీయ పాస్‌పోర్ట్‌లతో ఉన్న ఎన్నారైలు భారతదేశానికి వచ్చిన వెంటనే ఆధార్ కార్డులను అందించాలని లో ప్రతిపాదించారు. అంతేకాదు ఆధార్ కోసం ఎన్ఆర్ఐల సాధారణ నిరీక్షణ సమయాన్ని తొలగించారు. UIDAI ఆగస్టు 25, 2021న ఈ అంశంపై ఎన్ఆర్ఐలు 182 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని, చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న ఎన్నారైలు భారతదేశానికి వచ్చిన వెంటనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ట్వీట్ చేసింది.
ఎన్ఆర్ఐల ఆధార్ నమోదు విధానం :
* భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత మీ భారతీయ పాస్‌పోర్ట్‌తో సమీపంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లండి.
* ఆధార్ నమోదు ఫామ్ ను ఫిల్ చేయండి.
* ఎన్ఆర్ఐ ఎన్‌రోల్‌మెంట్ డిక్లరేషన్‌ను ఫిల్ చేసి, ఒకేసారి చదివి సంతకం చేయండి.
* ఆపరేటర్ ను మిమ్మల్ని ఎన్ఆర్ఐ గా నమోదు చేయమని అడగాలి
* గుర్తింపు రుజువుగా మీ పాస్‌పోర్ట్‌ను UIDAI అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది.
* బయోమెట్రిక్ క్యాప్చర్, రెటీనా స్కాన్ ప్రక్రియలను పూర్తి చేయాలి.
* అక్కడికక్కడే ఫోటోను ప్రింట్ చేస్తారు. దానిని అక్కడే ఇవ్వండి.
* UIDAI అసోసియేట్ కు మీ అప్లికేషన్ ఫామ్ ను ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు చదువుకోండి.
* మీ అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్/ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌ను తీస్కోండి. ఇందులో 14 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడి , తేదీ, టైమ్, స్టాంప్ ఉంటాయి.
* ఆధార్ కార్డు మీ ఇంటికి రావడానికి 90 రోజులు వేచి ఉండాలి.