ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, అలాగే.. దాని పరిధిని మరింత విస్తృతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడే పుట్టిన పసిపాప నుండి వృద్ధుల వరకు జనన, మరణాలను దృవీకరించేందుకు ఆధార్ కు లింక్ చేయాలని నిర్ణయించినట్టు ఉడాయ్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా నవజాత శిశువులకు బయో మెట్రిక్ వివరాలు తీసుకుని.. శాశ్వత ఆధార్ కార్డును జారీ చేయనున్నట్టు తెలిపారు. అయితే.. 18 ఏళ్ల తర్వాత మరోసారి బయోమెట్రిక్ వివరాలు రీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
దీంతో బహుళ ఐడీలను జనరేట్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. పైగా చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ పథకాల నుంచి దూరం కాలేరని సదరు అధికారి వివరించారు. ప్రస్తుతం ఐదేళ్ల లోపు చిన్నారుల ఆధార్ వివరాలు సేకరిస్తున్నప్పటికీ.. వారి బయోమెట్రిక్ వివరాలు తీసుకోవడం లేదన్నారు.
దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో తక్కువ సంఖ్యలో మాత్రమే ఆధార్ నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో ఉడాయ్ ఈ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మరో వైపు భారత పౌరుడిగా ఆధార్ తీసుకుంటున్నప్పటికీ.. ఎవరైనా చనిపోతే ఆ వివరాలు ఉడాయ్ వద్ద నమోదు కావడం లేదని.. దీంతో ఇప్పటికీ ఆధార్ నంబర్ కలిగిన వ్యక్తి పేరుతో పెన్షన్ అందుకుంటున్నారని.. దీనివల్ల ప్రభుత్వ పథకాలు దుర్వినియోగమవుతున్నాయని అధికారులు గుర్తించారు.
ముఖ్యంగా కరోనా సమయంలో చాలా మంది మరణించినప్పటికీ వారి వివరాలేవీ ఉడాయ్ దగ్గర లేవని గుర్తించారు. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరణాల వివరాలు తీసుకోనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని సుమారు 130 కోట్ల మందికి వేర్వేరుగా కేటాయించిన 12 అంకెల గుర్తింపు సంఖ్య గల ఆధార్ కార్డులను ప్రస్తుతం జారీచేశారు.