“నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ జంట చూడ్డానికి చాలా బాగుంది. నిక్కీ చాలా బాగుంది. ఆది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీ.” అప్పుడెప్పుడో ఐదేళ్ల కిందట ఆది పినిశెట్టిని ఉద్దేశించి, హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఇవి. మరకతమణి అనే సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన నాని, అప్పట్లో ఈ కామెంట్లు చేశాడు. ఇప్పుడు అవే నిజమయ్యేలా ఉన్నాయి.
హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమించుకుంటున్నారట. రేపోమాపో వీళ్లిద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నారంటూ కోలీవుడ్ లో చాలా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. నిజానికి వీళ్ల ప్రేమ కబుర్లు జనాలకు కొత్త కాదు. దాదాపు 4 ఏళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి.
చెన్నైలో చాలా చోట్ల వీళ్లిద్దరూ కలిసి కనిపించారు. డిన్నర్లకు, పార్టీలకు వెళ్లారు. అంతెందుకు.. ఆమధ్య ఆది ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ కు కూడా నిక్కీ గల్రానీ వెళ్లింది. పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఆ ఫంక్షన్ కు నిక్కీ వెళ్లడంతోనే అందరికీ అనుమానం కలిగింది. అంతకంటే ముందు ఎయిర్ పోర్టులో వీళ్లిద్దరూ కనిపించారు.
ఈ ఊహాగానాలు ఏ రేంజ్ కు వెళ్లాయంటే.. నిక్కీ-ఆది ఎంగేజ్ మెంట్ అయిపోయిందట. కరోనా వల్ల ఇన్నాళ్లూ ఆగారంట. రేపోమాపో పెళ్లి చేసుకుంటారంటూ కథనాలు వస్తున్నాయి. మరి ఈసారి చాలా గట్టిగా వినిపిస్తున్న ఈ పుకార్లపై ఆది పినిశెట్టి ఎలా స్పందిస్తాడో చూడాలి.