రీసెంట్ గా వివాహ బంధంలోకి ఎంటరయ్యాడు నటుడు ఆది పినిశెట్టి. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ నిక్కీ గల్రానీని పెళ్లాడాడు. ఆ తర్వాత హనీమూన్ లాంటివేం పెట్టుకోలేదు ఈ జంట. ఇద్దరూ తమతమ సినిమాలతో బిజీ అయిపోయారు. అలా ఓవైపు మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్నాడు ఆది పినిశెట్టి.
తాజాగా అతను నటించిన వారియర్ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే.. ప్రచారంలో భాగంగా మీడియా ముందుకొచ్చాడు ఆది. పెళ్లికి ముందు మీడియాతో మాట్లాడిన ఈ నటుడు, పెళ్లి తర్వాత ప్రెస్ ను పలకరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితంపై స్పందించాడు.
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత పెద్దగా తనకు తేడా కనిపించలేదంటున్నాడు. ఎందుకంటే, నిక్కీ గల్రానీ తన జీవితంలో చాలా ఏళ్లుగా ఉందని చెప్పుకొచ్చాడు. పెళ్లికి ముందు తామిద్దరం బాగున్నామని, పెళ్లి తర్వాత ఇంకా చాలా బాగున్నామని చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా తమను అర్థం చేసుకునే తల్లిదండ్రులు దొరకడం అదృష్టం అంటున్నాడు.
దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్నారు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ. తమిళ సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట, అప్పట్నుంచి మంచి స్నేహితులయ్యారు. స్నేహాన్ని దాటి ప్రేమలోకి ఎంటరైన విషయాన్ని లాక్ డౌన్ టైమ్ లో తెలుసుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ ఏడాది మార్చి లో నిశ్చితార్థం జరిగింది. మే నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు.