అవకాశాలు తగ్గితే ఇండస్ట్రీ నుంచి బయటకెళ్లిపోవడమే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పరిశ్రమలో అవకాశాలు బాగా పెరిగాయి. సినిమాల్లో ఛాన్సులు దక్కని నటీనటులు ఓటీటీ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ హీరోయిన్, మరో హీరో ఒకేసారి ఓటీటీ డెబ్యూ ఇస్తున్నారు.
తాజాగా పులి-మేక అనే వెబ్ సిరీస్ లాంఛ్ అయింది. జీ5 ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. కోన వెంకట్ రచయిత. గతంలో గోపీచంద్ తో పంతం అనే సినిమా తీసిన చక్రవర్తి, ఈ సిరీస్ కు దర్శకుడు. ఇప్పుడీ సిరీస్ తో లావణ్య త్రిపాఠి ఓటీటీలో అడుగు పెడుతోంది. అంతేకాదు.. ఇదే సిరీస్ తో ఆది సాయికుమార్ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాడు.
లావణ్య త్రిపాఠికి కొన్నాళ్లుగా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా షూటింగ్ పూర్తయింది. దీంతో ఆమె ఓటీటీకి జై కొట్టింది. అటు ఆది సాయికుమార్ పరిస్థితి పూర్తి భిన్నం. ఆయనకు వరుసగా సినిమా ఛాన్సులొస్తున్నాయి. కానీ ఏదీ హిట్టవ్వడం లేదు. హీరోగా అతడి మార్కెట్ దాదాపు పడిపోయింది. దీంతో ఆది కూడా ఓటీటీలోకి వచ్చేశాడు.
వీళ్లిద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి. మర్డర్ మిస్టరీ కి జాతకాల కాన్సెప్ట్ జోడించి కోన వెంకట్ ఈ సిరీస్ కథ రాశాడు. ఆది, లావణ్యకు ఈ సిరీస్ అయినా కలిసిరావాలని కోరుకుందాం.