టాలీవుడ్ లో సీనియర్ నటి ఆమని. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన ఈ మాజీ హీరోయిన్, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ పోషిస్తోంది. అయితే ఇన్ని పాత్రలు పోషిస్తున్నప్పటికీ తనకు ఇంకా సంతృప్తి దొరకడం లేదంటోంది ఈ సీనియర్ నటి. దీనికి ఆమె ఓ రీజన్ కూడా చెబుతోంది.
“నటికి ఎన్ని పాత్రలు చేసినా సంతృప్తి రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన వుంటుంది. నాకు అమ్మవారి పాత్ర, పోలీసు పాత్ర ఇలా మరికొన్ని భిన్నమైన పాత్రలు చేయాలనుంది. అలాగే దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, పూరీ జగన్నాథ్, మణిరత్నం ఇలాంటివారి చిత్రాల్లో నటిస్తే నటిగా ఇంకా మెరుగులు దిద్దుకోగలుగుతాం.”
ఇలా తన మనసులో మాట బయటపెట్టింది ఆమని. రీఎంట్రీలో మళ్లీ తెలుగు చిత్రాలపైనే ఫోకస్ పెట్టడానికి గల కారణాన్ని కూడా బయటపెట్టింది.
“నటిగా నేను పీక్ స్టేజ్ లో వుండి ఆ తర్వాత పిల్లల పెంపకం వల్ల గేప్ తీసుకున్నా. ఇప్పుడు నటించడానికి వీలు కలుగుతుంది. అందుకే ఇతర భాషల కంటే నాకు పేరుతెచ్చిన తెలుగు రంగంపైనే దృష్టి పెట్టాను. ఒకప్పడు హీరోయిన్లకు, కేరెక్టర్ ఆర్టిస్టలకు కూడా ప్రాధాన్యత వుండేది. కానీ రానురాను అది లోపించింది. హీరోయిన్‌లు కూడా నామ మాత్రంగానే కథలో భాగమైపోయారు. ఇందులో ఎవరి తప్పులేదు. ట్రెండ్ ను బట్టి ఫాలో అవ్వడమే.”
ఒకప్పుడు హీరోయిన్లకు చాలా తక్కువగా అవకాశాలు వచ్చేవని, కానీ ఇప్పటితరం హీరోయిన్లకు ఆ బెంగ లేదంటోంది ఆమని. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా.. సీరియల్స్, వెబ్ సిరీస్, ఒరిజినల్ మూవీస్ లో నటించి తమ టాలెంట్ చూపించుకునే అవకాశం అందంటోంది.