రాజకీయ విశ్లేషకులు ఊహించినట్టుగానే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ నిజమయ్యాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడో సారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఆప్ 63 స్థానాలకు గెల్చుకొని హ్యాట్రిక్ సాధించింది. జాతీయ పార్టీ బీజేపీ 7 సీట్లతో సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. లీడర్, కేడర్ లేక ఇటీవల వరుస ఓటమిలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోవడంలో పెద్ద విశేషమేమి లేదు. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి…దేశ వ్యాప్తంగా మోదీ హవా కొనసాగుతోన్న సమయంలో బీజేపీ ఓడిపోవడమే విశేషం. కీలకమైన దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు బీజేపీ వేసిన పావులు ఏవీ పారలేదు. ఢిల్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వందల మంది ఎంపీలు, కేంద్ర మంత్రులను రంగంలోకి దించి ప్రచారం నిర్వహించినప్పటికీ కేజ్రీవాల్ వ్యూహం ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయింది. గత ఎన్నికల కంటే నాలుగు సీట్లు అధికంగా గెల్చుకుంది. పని చేసే వారికే ప్రజలు పట్టం కడతారంటూ మొదటి నుంచి ప్రచారం చేస్తోన్న ఆప్ నేతల మాటలు నిజమయ్యాయి.
తమ పార్టీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు అర్వింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ”పని” అనే కొత్త రాజకీయాలకు తెరతీసిందన్నారు. ఇది ”భరతమాత విజయం” గా పేర్కొన్నారు. తమ విజయం వెనుక హనుమాన్ కూడా ఉన్నాడంటాడు కేజ్రీవాల్. ” ఈరోజు మంగళవారం…హనుమాన్ జీ మన మీద ఆశీర్వాదం కురిపించాడు” అని చెప్పారు. ఇది నా విజయం కాదు..ఇది ఢిల్లీ విజయం.. ప్రతి కుటుంబానికి 24 గంటల విద్యుత్, నీళ్లు, విద్య ఇస్తున్నందుకు అందరు తనను కుమారుడిగా చూసుకున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ హనుమాన్ ఆలయానికి వెళ్లడంపై కూడా బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఓడిపోతున్నామని తెలిసే గెలుపు కోసం దేవాలయాలు తిరుగున్నారని విమర్శించారు.
ఆప్ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయంలో బ్లూ, వైట్ బెలూన్లు ఎగురవేస్తూ రంగులు చల్లుకున్నారు.ఆప్ విజయంతో కేజ్రీవాల్ కు అభినంధనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా ఆత్మను ఢిల్లీ కాపాడిందని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ అభినంధించగా…విభజన రాజకీయాలకు, రెచ్చగొట్టే ప్రసంగాలకు ఈ విజయం సమాధానమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు.