ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మరోసారి రచ్చ జరిగింది. మున్సిపల్ సమావేశంలో ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో మున్సిపల్ భవనం రణరంగాన్ని తలపించింది. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రిసైడింగ్ అధికారి వెల్లడించారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న జరగాల్సి వుంది. కానీ మొదటి రోజు సమావేశంలో ఆప్, బీజేపీ నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు. దీంతో ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ రోజు సమావేశంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
సమావేశం మొదలు కాగానే మొదట లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి హడావుడిగా ప్రమాణం చేయించారు. అనంతరం సభను పదిహేను నిమిషాలు వేశారు. సభ పున: ప్రారంభమైన తర్వాత లోపలికి వచ్చిన బీజేపీ నేతలు మోడీ అనుకూల నినాదాలు చేశారు.
ఆప్ నేతలను చూస్తూ మోడీ నినాదాలతో బీజేపీ నేతలు సభను హోరెత్తించారు. దీంతో ఆప్ సభ్యులు ప్రతిగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో గందరగోళం ఏర్పడింది. ఇక ఈ పరిస్థితుల్లో ఎన్నిక నిర్వహించలేమని భావించిన అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.