దేశ రాజధాని ఢిల్లీలో మేయర్ ఎన్నికలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు బీజేపీ, ఆప్ పార్టీలు పోటాపోటీగా వీధుల్లో నిరసన ప్రదర్శనలకు దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. మొదట ఆప్ మద్దతుదారులు బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
దీంతో అటు బీజేపీ నేతలు కూడా ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి కవాతుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వారిపై వాటర్ కెనాన్లను ప్రయోగించారు.
ఢిల్లీ కొత్త మేయర్‌ను ఎన్నుకునే సమావేశంలో ఇటీవల ఘర్షణ జరిగింది. మేయర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తమ కౌన్సిలర్లు గాయపడ్డారని ఇరు పార్టీలు పేర్కొన్నాయి.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో 134 స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది. షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్‌లను తమ అభ్యర్థులుగా ఆప్ ప్రకటించింది. మరో వైపు బీజేపీ మేయర్ పదవికి రేఖా గుప్తాను నిలబెట్టింది. ఢిల్లీ నుంచి బీజేపీకి చెందిన ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ఆప్‌కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఢిల్లీ స్పీకర్ నామినేట్ చేసిన 14 మంది ఎమ్మెల్యేలు కూడా మేయర్ ఎన్నికలో పాల్గొంటారు.
అయితే 10 మంది నామినేటెడ్ సభ్యులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించారు. దీనిపై ఆప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే అపాయింట్‌మెంట్‌లు చేసినందుకు సక్సేనాను ఆప్ టార్గెట్ చేసింది. దీంతో బీజేపీ నేతలు దాన్ని ఖండించారు.
సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉందని బీజేపీ పేర్కొంది. మేయర్ ఎన్నికలకు ముందు ఆల్డర్‌మెన్‌లను నామినేట్ చేయడం ద్వారా బీజేపీకి మేలు చేయడానికి కుట్ర పన్నుతుందని ఆప్ ఆరోపించింది. నిబంధనల ప్రకారం నామినేటెడ్ సభ్యులు ఎన్నికల్లో ఓటు వేయలేరని పేర్కొంది.