అదానీ గ్రూప్స్ వ్యవహారంపై పార్లమెంట్‌లో ఈ రోజు కూడా రచ్చ జరిగింది. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఉభయ సభల నుంచి రెండు పార్టీలు వాకౌట్ చేశాయి.
అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఇరు పార్టీలు ఆందోళనకు దిగాయి. ఇరు పార్టీల నేతలు ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేశాయి. అదానీ సంక్షోభంపై విచారణకు జేపీసీని నియమించాల్సిందేనని డిమాండ్ చేశాయి.
ఇక రాజ్యసభలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. అదానీ గురించి ప్రభుత్వాన్ని ఎన్నో ప్రశ్నలు అడిగామని ఆయన అన్నారు. వాటిలో ఏ ఒక్క దానికి కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదన్నారు.
ప్రధాని మోడీ ఎప్పుడూ ఇష్యూలను డైవర్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశ ప్రజల హక్కుల కోసం తమ పార్టీ పోరాడుతోందని ఆయన అన్నారు. అన్ని నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తన వ్యాఖ్యల్ని తొలగించాలని ఆయన కోరారు.