ఆమ్ ఆద్మీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభకు పద్మశ్రీ అవార్డు గ్రహీతలను పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యసభ ఎన్నికలకు పార్టీ తరఫున ఇద్దరు పద్మ అవార్డు గ్రహీతలను నామినెట్ చేసింది.
ప్రముఖ పర్యావరణ కార్యకర్త బాబా బల్బీర్ సింగ్ సీచేవాల్, వ్యాపారవేత్త, దాత విక్రమజిత్ సింగ్ సాహ్నేలను పార్టీ తరఫున రాజ్యసభ పంపాలని ముఖ్యమంత్రి మాన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
‘రాజ్యసభకు ఆప్ తరఫున ఇద్దరు పద్మ అవార్డు గ్రహీతలను పోటీకి నిలపాలని నిర్ణయించాము. పర్యావరణ కార్యకర్త సంత్ బాబా బల్బీర్ సింగ్, వ్యాపారవేత్త విక్రమ జిత్ సింగ్ లను పెద్దల సభకు పంపాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని మీకు తెలపడం మాకు ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీ కాలంలో వచ్చే నెలతో ముగియనుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబికా సోనీ, శిరోమణి అకాళీదల్ పార్టీకి చెందిన బల్వీందర్ సింగ్ ల పదవీ కాలం జూన్ 4తో ముగియనుంది.