ఆప్ పార్టీ తన అధికార ప్రస్థానాన్ని ఢిల్లీలో ప్రారంభించింది. తాజాగా పంజాబ్ లోనూ అద్భుతమైన విజయాన్ని సాధించి అక్కడ అధికారాన్ని చేజిక్కిచ్చుకున్నది. ఇదే ఊపు మీద మరి కొన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని, తద్వారా దేశ రాజకీయాల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని ఆప్ పార్టీ భావిస్తోంది.
అందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్, అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే ఆప్ పార్టీ దృష్టి సారించింది. అయితే ఇటు దక్షిణాదిలోనూ పార్టీని విస్తరించాలన్న ఆలోచనలో ఆప్ ఉన్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణపై ఆప్ పార్టీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పాదయాత్రలు ప్రారంభించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏప్రిల్ చివర్లో ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ రాష్ట్రానికి రానున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ పాదయాత్రలను ప్రారంభించనున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Advertisements
ఇక ఇప్పటికే తెలంగాణకు ఆప్ పార్టీ ఇన్ చార్జీగా సోమనాథ్ భారతీని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ నియమించారు. ఈ పాదయాత్రల ఏర్పాట్లను సోమ్ నాథ్ భారతీ దగ్గర ఉండి పరిశీలించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.