ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జోరును కనబరిచింది. ఎలక్షన్ కమీషన్ డేటా ప్రకారం మొత్తం 250 స్థానాలకు గానూ కేజ్రీవాల్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 125ను క్రాస్ చేసింది. ఇప్పటి వరకు 134 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మేయర్ పీఠం ఆప్ వశమైంది.
అయితే ఈ ఎన్నికలపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమన్నా ప్రభావం చూపిస్తుందని బీజేపీ ప్రభుత్వం అనుకుంది. కానీ ఆ కేసు ప్రభావం ఈ ఎన్నికలపై ఏ మాత్రం చూపలేదు. దీంతో బీజేపీ ఖంగుతింది. ఇక బీజేపీ ఇప్పటివరకు 97 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ 9 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. ఢిల్లీలో 15 ఏళ్లుగా బీజేపీ అధికారం చేపడుతూ వస్తోంది. ఇప్పుడు బీజేపీ కంచుకోటను ఆప్ బద్దలుకొట్టింది.
ఢిల్లీలోని 250 వార్డులకు డిసెంబర్ 4న జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 శాతం ఓటింగ్ నమోదు కాగా.. మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో అప్పటి సీఎం షీలా దీక్షిత్ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. ఎంసీడీగా పునరుద్ధరించిన తరువాత ఇదే మొదటి ఎన్నికలు కావడం గమనార్హం.
కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడునున్న వేళ.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆప్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ కార్యాలయం వద్ద ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో విజయం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.