ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడంతో కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు రాఘవ్ చద్దా(31), అతిషికి కేబినెట్లో బెర్త్ ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో వారిద్దరు ఆప్ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. కేంద్ర ప్రభత్వం వారి నియామకాలు చట్ట విరుద్ధమని తొలగించడంతో రాజకీయాల్లో చేరి గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
రాఘవ్ చద్దా…చార్టెడ్ అకౌంటెంట్…ఆప్ అధికార ప్రతినిధి. పార్టీలో బాగా తెలిసిన ముఖం. రాజేంద్ర నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20 వేల మెజార్టీతో గెలుపొందారు. రాఘవ్ చద్దా తన వినూత్న ప్రచారంతో ఎన్నికల్లో ఓటర్లను ఇట్టే ఆకర్శించేవారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న 31 ఏళ్ల ఈ బ్యాచ్ లర్ నేత ఓట్లు వేయమని అడిగితే అమ్మాయిలు తనను పెళ్లి చేసుకోమని అడిగేవారు. పెళ్లి చేసుకోమని రోజుకు చాలా మంది మెస్సేజ్ లు పెట్టే వారు. వారి ప్రశ్నలకు రాఘవ్ కూడా చాలా చమత్కారంగా సమాధానాలు ఇచ్చేవారు. తనను పెళ్లి చేసుకొమ్మని కోరిన ఓ అమ్మాయికి ”ఇప్పుడు దేశ ఆర్దిక పరిస్థితి బాగా లేదు…పెళ్లి ఏం చేసుకుంటాం” అని సమాధానం ఇచ్చారు.
కొత్త ఆర్ధిక మంత్రి మీరేనా ? అని మీడియా అడగ్గా ఇవన్నీ ఊహాగానాలు, సంబంధం లేనివని కొట్టి పారేశారు. అర్వింద్ కేజ్రీవాల్ గెలిచారు.. చాలు…ఆప్ కార్యకర్తలు, నేతలు అందరూ ఆయన వెంట ఉన్నారన్నారు. పార్టీ లీగల్ సెల్ ఇన్ చార్జ్ గా ఉండడమే కాకుండా పార్టీ సందేశాలను ప్రజలకు చేర వేయడంలో కీలక పాత్ర పోషించారు రాఘవ్ చద్దా. 2015 లో ఆప్ అధికారంలోకి రాగానే ఇంటర్నేషనల్ ట్యాక్స్, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ లో స్పెషలైజేషన్ చేసిన రాఘవ్ ను ఆర్దిక మంత్రి మనీష్ సిసోడియాకు అడ్వైజర్ గా నియమించారు.
అతిషి…సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్…ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మాజీ విద్యార్ది అయిన అతిషికి విద్యారంగం మీద పనిచేయడం చాలా ఇష్టం. గతంలో విద్యా శాఖను చూసిన మంత్రి మనీష్ సిసోడియాకు అతిషి సలహాదారుగా ఉన్నారు. దీంతో కేజ్రీవాల్ ఆమెకు విద్యాశాఖను అప్పగిస్తారని అనుకుంటున్నారు.