ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మహేందర్ గోయల్ డబ్బు కట్టలతో అసెంబ్లీకి హాజరయ్యాడు. కాంట్రాక్టుల విషయంలో ఒకరు తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ అసెంబ్లీ అన్నారు. ఈ మేరకు ఆయన వెంటన తెచ్చిన నోట్ల కట్టలను తీసి సభ ముందు ఉంచారు.
దీంతో కలకలం రేగింది. రోహిణిలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆస్పత్రిలో తాత్కాలిక సిబ్బంది నియామక విషయంలో అవకతవకలు జరిగాయని ఆ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. పలుకు బడి ఉన్న కొందరు వ్యక్తులు తనకు లంచం ఆశచూపి తన నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
తన ప్రాణలకు కొందరు వ్యక్తుల నుంచి ముప్పు ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. కానీ తాను ఇలాంటి బెదరింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోనన్నారు. తనకు లంచం ఇవ్వ జూపిన ప్రైవేటు కాంట్రాక్టరుపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తన జీవితం ప్రమాదంలో పడిందని ఆయన సభకు తెలిపారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్ వెంటనే స్పందించారు. ఇది చాలా సీరియస్ అంశమని స్పీకర్ అన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదును పిటిషన్స్ కమిటీ ఆఫ్ హౌస్‌కు అప్పగించారు.