నిప్పులేకుండా పొగరాదంటారు. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాలపై వరుసగా వస్తున్న రూమర్ల విషయంలో ఇది నిజమని తేలింది. గతకొద్ది కాలంగా వీరు లంచ్,డిన్నర్, క్లబ్బులు, మీటింగు లంటూ జంట పక్షుల్లా ఎక్కడబడితే అక్కడ బిజీగా తిరుగుతుండడంతో డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి.
ఈ నేపథ్యంలో త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవుతారని ఆప్ ఎంపీ (AAP) ధ్రువీకరించారు. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాల వివాహం త్వరలో జరుగుతుందని ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ట్వీట్ చేశారు.
వీరిద్దరి రోకా వేడుక జరిగిందని, కాబోయే దంపతులు ప్రేమ, సంతోషం, సాన్నిహిత్యంతో మెలగాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్‌ాలు తెలుపుతున్నానని ఆప్ ఎంపీ ట్వీట్ చేశారు.
సంజీవ్ అరోరా ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాలకు వారు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రేమ జంటకు త్వరలోనే పెండ్లి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
కొద్దిమంది స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం జరిపించాలని వారు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. కాగా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాలకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. వారిద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో కలిసి చదువుకున్నారు.