కర్ణాటకలో ‘ఢిల్లీ మోడల్’ పాలన తెస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రకటించింది. కన్నడ రాష్ట్రంలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఫోకస్ ని ఈ రాష్ట్రంపై పెట్టింది. కర్ణాటకలో అన్ని అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేయాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర శాసన సభలో మొత్తం 224 సీట్లున్నాయి. ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇదివరకే ఎంపిక చేశామని, వారి విద్య, విజయావకాశాలు తదితరాలను మదింపు చేశామని, సాధ్యమైనంత త్వరలో తొలి జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయని ఈ వర్గాలు వెల్లడించాయి.
గుజరాత్ లో కన్నా కర్ణాటకలో మా పని తీరు బాగుంటుందని గత డిసెంబరులోనే తాము ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశాయి. మొదట రాజధాని బెంగుళూరులో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక సమస్యలపై ఆప్ దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి తాయిలాలను ప్రచారం సందర్భంగా ఆప్ ప్రకటించబోతోంది.
సమీప భవిష్యత్తులో కేజ్రీవాల్ తరచూ కర్ణాటక విజిట్ చేసి ప్రచార శంఖం పూరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు కర్ణాటకకు ఆప్ ఎన్నికల కో-ఆర్డినేటర్, ఢిల్లీ అసెంబ్లీలో పార్టీ చీఫ్ విప్ దిలీప్ పాండే మెల్లగా సన్నాహాలు చేస్తున్నారు. కొత్త టీమ్ తో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటాం అని ఆయన ఇటీవల తెలిపారు.
ఇందుకు గాను ఈ నెల 11 న తమ రాష్ట్ర, జిల్లా స్థాయి శాఖలను పార్టీ రద్దు చేసింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో స్వీప్ చేసిన ఈ పార్టీ లోగడ జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. బీజేపీని ఓడించి అత్యధిక వార్డులను గెలుచుకుంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కొత్త వలంటీర్లు, మద్దతుదారులతో తాము టచ్ లో ఉన్నామని దిలీప్ పాండే మళ్ళీ గుర్తు చేశారు.