లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ తో ఆప్ నేతలు రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నారు. అయితే.. హైదరాబాద్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.
సిసోడియా అరెస్ట్ ను నిరసిస్తూ.. రాష్ట్ర ఆప్ కార్యకర్తలు హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ ను ముట్టడించేందుకు చూశారు. దీంతో ఆ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ, సీబీఐ డౌన్ డౌన్ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసులు ఆప్ కార్యకర్తలను అడ్డుకున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని భావించి అందర్నీ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆప్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీతోపాటు పలు నగరాల్లో ఆప్ కార్యకర్తలు సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ధర్నాలు కొనసాగించారు. లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ ఆదివారం సిసోడియాను అరెస్టు చేసింది. ఆప్ నిరసనల దృష్ట్యా దేశ రాజధానిలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు.