మైనర్ బాలిక ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్ అయింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని.. పట్టించుకునే నాథుడే లేడని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు ఆపార్టీ నేతలు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఆప్ నేత ఇందిరాశోభన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఘటన జరిగి వారం రోజులైనా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఇందిరాశోభన్ ఫైరయ్యారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆప్ పోరాటం సాగిస్తుందని తెలిపారు.
అంబేద్కర్ రాజ్యాంగపరంగా ఇచ్చిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు ఇందిరాశోభన్. అలాంటి రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా, ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో, కుమారుడు ప్రగతిభవన్ లో ఉంటూ జనాన్ని కలవడం లేదని విమర్శించారు.
మహిళల భద్రతపై ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. దిష్టిబొమ్మను దహనం చేసేందుకు చూశారు ఆప్ నేతలు. కానీ.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.