బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో పాల్గొనడానికి నిన్న సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ కు చేరుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఆయనతో కలిశారు. ఇక్కడ ఆప్ పార్టీ నిర్మాణం గురించి చర్చించారు.
అరవింద్ కేజ్రీవాల్ తో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఇందిరా శోభన్, డాక్టర్ దిడ్డి సుధాకర్, శోభన్ బాబు భూక్య, బుర్ర రాము గౌడ్, డాక్టర్ అన్సారీ లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆప్ పార్టీ నిర్మాణం, అదే విధంగా కేజ్రీవాల్ తెలంగాణ పర్యటన విశేషాల గురించి ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే వచ్చానని, ఈ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, ఇది కేవలం ఒక అధికారిక కార్యక్రమం మాత్రమేనని తెలిపారు.
దీంతో పాటు తెలంగాణలో ఆప్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోర్ కమిటీ సభ్యులు.. రాష్ట్ర లోక్ సభ కన్వీనర్లతో, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులతో, క్రమశిక్షణ సంఘం కమిటీతో, రాష్ట్ర పార్టీ వీఆర్వోలతో మరియు పార్టీ కార్యకర్తలతో కేజ్రీవాల్ కు పరిచయం చేయించారు. అయితే కేజ్రీవాల్ బీఆర్ఎస్ పార్టీ మొదటి సారి నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి కేసీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ కు రావడం జరిగింది.