ఢిల్లీ బ్యూరోక్రాట్ల కంట్రోల్ పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ మీద ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తన పోరు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన ఇప్పటికే బెంగాల్ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీని, ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేని కలుసుకున్నారు. వీరంతా ఆయనకు తమ సపోర్ట్ ప్రకటించారు. బీహార్ సీఎం, జేడీ-యు చీఫ్ నితీష్ కుమార్ .. కేజ్రీకి మద్దతునిస్తున్నట్టు ఇదివరకే తెలిపారు. కాగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో కూడా సమావేశం కావాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు.
బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో నాకు మధ్దతు ఇవ్వాలని రాహుల్ గాంధీని, ఖర్గేను కోరదలచుకుంటున్నాను.. ఇందుకు సమయమివ్వాలని వారిని కోరాను అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఆర్డినెన్స్ స్థానే పార్లమెంట్ లో బిల్లు తెచ్చేందుకు బీజేపీ సర్కార్ యోచిస్తోంది.
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు తదితరాలపై కేంద్రానిది కాకుండా ఢిల్లీ ప్రభుత్వానిదే అధికారమని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినప్పటికీ దాన్ని కాదని కేంద్రం ఈ ఆర్డినెన్స్ ప్రకటించింది. వీరి పోస్టింగులు మొదలైనవాటిని పర్యవేక్షించేందుకు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసింది.
చివరకు ఫైనల్ ఆర్బిటర్ లెఫ్టినెంట్ గవర్నరేనని తేల్చింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసినట్టయింది. ఇక ఆర్డినెన్స్ అంశంలో ఈయనకు మద్దతు ఇవ్వాలా వద్దా అని కాంగ్రెస్ డైలమాలో పడింది. ఢిల్లీ, బెంగాల్ లో ఆప్ తమ ప్రత్యర్థి గనుక తాము ఆలోచించుకోవలసి ఉందని, తమ ప్రాంతీయ నాయకులను కూడా సంప్రదించవలసి ఉందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.