2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న ఆయన, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచామని గుర్తు చేశారు. ఇక తమ నెక్ట్స్ టార్గెట్ యూపీయేనని ప్రకటించారు.
యూపీకి చెందిన వారు ఎందరో ఢిల్లీలో ఉంటున్నారు. వారంతా ఆప్ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉండటమే కాదు యూపీలో ఉన్న పార్టీలతో విసిగిపోయి… తమను అక్కడ పోటీ చేయాలని కోరుతున్నారన్నారు. అందుకే తాము వచ్చే ఎన్నికల బరిలో ఉండబోతున్నట్లు ప్రకటించారు.
యూపీని ఎంతో మంది పాలించినా… చిన్న చిన్న అవసరాల కోసం యూపీ ప్రజలు ఢిల్లీకి రావాల్సి వస్తుంది. దీని వెనుక పాలకుల నిర్లక్ష్యం ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎందుకు మారకూడదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. యూపీలో ఉన్న డర్టీ పాలిటిక్స్ నుండి విముక్తి కల్పించటమే లక్ష్యంగా ఆప్ కార్యాచరణ ఉంటుందన్నారు.