అదానీ సమస్యపై విపక్షాల్లోనే మూడు ప్రతిపక్షాలు మా దారి వేరని, మీతో ఏకీభవించే ప్రసక్తి లేదని ఇతర పక్షాలకు తేల్చి చెప్పాయి. ఆప్, బీఆర్ఎస్, శివసేన పార్టీల నేతలు.. పార్లమెంటులో అదానీ అంశంపై చర్చ జరపాలని తాము పట్టుబడుతుంటే.. మీరేమో .. సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి జరిగే చర్చలో పాల్గొంటారేమిటని ప్రశ్నిస్తున్నాయి. మంగళవారం ప్రతిపక్షాలకు సంబంధించి ఇదో విచిత్ర పరిస్థితిలా తయారైంది.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి చర్చ ప్రారంభిద్దామని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ ప్రకటించగానే .. ఈ మూడు పార్టీల నేతలూ తాము సభను బాయ్ కాట్ చేస్తున్నామని వెల్లడించారు. అదానీ అంశంపై జేపీసీ చేత గానీ, సుప్రీంకోర్టు చేతగానీ విచారణ జరిపించాలన్న తమ డిమాండులో ఎట్టి మార్పు లేదని, మొదట దీనిపై పార్లమెంటు చర్చించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, డీఎంకే, సీపీఎం, ఆర్ఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, జేడీ-యు తో సహా 14 విపక్షాల నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని బీఆర్ఎస్ నేతలు కూడా స్పష్టం చేశారు. తమ నిరసనను కొనసాగిస్తామని పేర్కొన్నాయి.
విపక్షాల్లో తాము ఏకాకులమైనా ఇది తప్పదన్నాయి. ధన్యవాద తీర్మానాన్ని అదానీ అంశంతో ఎలా ముడిపెడతామని, అందువల్ల ఆ చర్చలో పాల్గొనబోమని చెప్పాయి. జేపీసీ విచారణకు ప్రభుత్వం అంగీకరించనప్పుడు ఇక ఈ చర్చలో మేమెలా పాల్గొంటామని బీఆర్ఎస్ నేత కె.కేశవరావు అన్నారు. దీంతో అదానీ వివాదంపై విపక్షాల్లో చీలిక స్పష్టంగా కనిపించింది.