ప్రజా రక్షణకు సంబంధించి కేంద్రం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు స్థానికంగా ఉండే పౌరులు వెంటనే స్పందించేలా వారికి శిక్షణ ఇవ్వాలని చూస్తోంది. దేశవ్యాప్తంగా 350 జిల్లాల్లో ఆపద మిత్ర పేరుతో దీన్ని ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు కేంద్రమంత్రి అమిత్ షా. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ విషయం వెల్లడించారు.
నిజానికి విపత్తులు సంభవించిన సమయంలో ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు సహాయ సహకారాలు అందిస్తుంటాయి. అయితే ఆయా సంస్థలు వచ్చేలోపే స్థానికంగా ఉండే యువతకు శిక్షణ ఇస్తే ప్రాణనష్టం జరగకుండా చూడొచ్చనేది కేంద్రం భావన. ఆ ఆలోచనతోనే ఆపద మిత్ర కార్యక్రమాన్ని తీసుకురావాలని చూస్తోంది. విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే ఎలా స్పందించాలి, ప్రజలను ఎలా కాపాడాలి వంటి విషయాలపై యువతకు శిక్షణ ఇవ్వాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకునే వారికి బీమా సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు అమిత్ షా. 28 రాష్ట్రాలతో ఒప్పందాలు కూడా జరిగాయని వివరించారు.
దేశంలో మనకు ప్రధానంగా ఎదరయ్యే సమస్య వరదలు. వర్షాకాలంలో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగడం.. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో 25 రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో ఆపద మిత్ర పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించామన్నారు షా. గతంలో వచ్చిన తుపాన్లకు.. ఈమధ్య వచ్చిన వాటికి మధ్య జరిగిన ప్రాణ నష్టాన్ని అంచనా వేస్తే ఇది తెలుస్తుందని వివరించారు. అలాగే ఆస్పత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని కూడా తెలిపారు. వనరులు పరిమితంగా ఉన్నా… భారత్ ప్రపంచంలోని మిగతా దేశాల కంటే సమర్థవంతంగా విపత్తులను ఎదుర్కొందని చెప్పారు. అలాగే కరోనా మహమ్మారిపై పోరాటంలో మరణాల రేటును గణనీయంగా తగ్గించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు అమిత్ షా.