కేజ్రీవాల్ కేబినెట్‌లో ఇద్దరు కొత్త మంత్రులు చేరారు. కేబినెట్ మంత్రులుగా సౌరభ్ భరద్వాజ్, అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. సౌరభ్ భరద్వాజ్ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మొదటి సారి కేజ్రివాల్ సర్కార్ ఏర్పడినప్పుడు ఆయన మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రెండో సారి ఆప్ సర్కార్ వచ్చాక ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ ల రాజీనామాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి వచ్చింది.
సౌరభ్ భరద్వాజ్‌కు ఆరోగ్యం, పరిశ్రమలశాఖలను సీఎం కేటాయించారు. అతిషికి విద్యాశాఖ, పబ్లిక్ వర్క్స్, టూరిజం శాఖల బాధ్యతలను కేజ్రివాల్ అప్పగించారు. అతిషి తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. కల్కాజీ శాసన సభ నియోజక వర్గం నుంచి ఆమె గెలుపొందారు.
గతంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అతిషి సలహాదారుగా పని చేశారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మార్పుల వెనుక ఆమె సలహాలు ఉన్నాయి. అతిషి సూచనల మేరకు ఆప్ సర్కార్ విద్యారంగంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది.