ఆమ్ ఆద్మీ పార్టీ లో నెంబర్ టూ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా ఎట్టకేలకు గెలుపొందారు. పట్పర్ గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిసోడియా మొదట లీడింగ్ లో ఉన్నప్పటికీ ఆ తర్వాత వెనుకంజ వేయడంతో కొంత ఆందోళనకు గురి చేసింది. చాలా సేపటి వరకు బీజేపీ అభ్యర్ది రవీందర్ సింగ్ నేగీ వెయ్యికి పైగా ఓట్లతో చాలా సేపు విజయం వైపు దూసుకుపోయారు. దీంతో సిసోడియా ఓటమి ఖాయమేనని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత రౌండ్లలో మళ్లీ సిసోడియా పుంజుకొని 3000 ఓట్ల మెజార్టీతో నేగీపై గెలుపొందారు” ఢిల్లీ మొత్తం అర్వింద్ కేజ్రీవాల్ చేసిన పనికే ఓటేసింది….పట్పర్ గంజ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది…ఫలితాల్లో కొంచెం ముందు వెనకలయ్యింది. చివరకు నేనే గెలిచాను…దేశంలో మొదటి సారిగా విద్య, వైద్యం కోసం పని చేస్తున్నందుకు ప్రజలు గెలిపించారు” అని సిసోడియా అన్నారు. పట్పర్ గంజ్ ప్రజలు విడిపోనందుకు నాకు సంతోషంగా ఉందని చెప్పారు.
కౌంటింగ్ జరుగుతుండగానే బీజేపీ నేతలు ఆప్ పై విమర్శలు చేశారు. ఆ పార్టీ నేత పర్వేష్ సాహిబ్ వర్మ మనీష్ సిసోడియా వెనుకంజలో ఉండడాన్ని ప్రస్తావిస్తూ ఎడ్యుకేషన్ పై జరిగిన ఎన్నికల్లో ఎడ్యుకేషన్ మినిస్టరే ఓడిపోతున్నారంటూ ఎద్దేవ చేశారు.
పట్పర్ గంజ్ నియోజకవర్గంలో ఢిల్లీలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. 1993 వరకు ఆ నియోజకవర్గం బీజేపీది. ఆ తర్వాత 2013 లో మనీష్ సిసోడియా వచ్చేంత వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉంది.