ఆప్ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఆరు వారాల మధ్యంతర బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్య కారణాలపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది.
ముందస్తు అనుమతులు లేకుండా ఢిల్లీ దాటి వెళ్ల కూడదని షరతులు విధించింది. మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆయన్ని ఆదేశించింది. సత్యేంద్ర జైన్ తనకు నచ్చిన ఆస్పత్రిలో చికిత్స పొంద వచ్చని పేర్కొంది. మెడికల్ రికార్డులను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
సత్యేందర్ జైన్ నిన్న తిహార్ జైలులోని బాత్రూంలో కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన ప్రస్తుతం ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆప్ వర్గాలు తెలిపాయి. వైద్యులు నిరంతరం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాయి.
ఇది ఇలా వుంటే గత కొంత కాలంగా జైన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ఆయన 35 కేజీల బరువు తగ్గారని, వెన్నెముక సమస్యతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఆయనకు వైద్య చికిత్స చేయించాలని వైద్యులు చెబితే ఈడీ తిరస్కరించిందన్నారు. దీంతో ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేస్తున్నామని న్యాయస్థానం తెలిపింది.