ఢిల్లీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. ఢిల్లీ నూతన మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబేరాయ్ విజయం సాధించారు. ఈ రోజు నిర్వహించిన ఎన్నికల్లో షెల్లీ ఒబేరాయ్ 34 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో షెల్లీ ఒబేరాయ్‌కు 150, బీజేపీ అభ్యర్థికి 116 ఓట్లు వచ్చాయి.
ఈ రోజు ఉదయం 11.30 గంటలకు మున్సిపల్ హౌస్‌లో మీటింగ్ ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి, హన్సరాజ్‌లు తొలుత ఓటేశారు. మొదట లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఓట్లు వేశారు. ఆ తర్వాత కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఒబేరాయ్ విజయం నేపథ్యంలో ఆప్ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ విజయంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో విజయం సందర్భంగా కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గూండాలు ఓడిపోయారు, ప్రజలు గెలిచారంటూ ఆయన ట్వీట్ చేశారు.
నామినేటెడ్ సభ్యుల ఓటింగ్ విషయంలో ఆప్-బీజేపీల మధ్య నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి6న ఎన్నిక జరగాల్సి వుండగా బీజేపీ-ఆప్ ఘర్షణల నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత ఎన్నికలను జనవరి 24, ఫిబ్రవరి 6 న నిర్వహించాల్సి వుండగా బీజేపీ-ఆప్ వార్ రిపీట్ కావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించారు.