సురేష్ మృతితో అసలు నిందితులు ఊపిరి పీల్చుకున్నారా…? ఎమ్మార్వోను అత్యంత పాశవికంగా చంపిన సురేష్ మరణంతో ఎమ్మార్వో హత్య కేసు కోల్డ్ స్టోరేజీకి వెళ్లిపోతుందా…? సురేష్ వాంగ్మూలంలో అసలు నిజాలు లేవా…?
ఎమ్మార్వో విజయా రెడ్డిని దారుణంగా చంపిన సురేష్ చనిపోయాడు, హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తెరవెనుక హంతకులు ఊపిరిపీల్చుకున్నారు. రెవెన్యూశాఖ చరిత్రలో జరగని సంఘటన జరిగింది, రాష్ట్రం యావత్తు ఉలిక్కి పడింది కానీ నిజం చచ్చిపోయింది.
విజయా రెడ్డి హత్యపై రకరకాల కథనాలు వస్తున్నాయి, దాడి జరిగిన కొద్దిసేపటికి ముందు లంచం అడిగినందుకు రైతు పెట్రోల్ పోసి తగలబెట్టాడు అని కొందరు ప్రచారం స్టార్ట్ చేశారు. నిందితుడు సురేష్ తల్లి, తండ్రి మాత్రం మా భూమి గొడవ కోర్టులో ఉంది, మా వాడు ఎమ్మార్వో ఆఫీస్ కు ఎందుకు వెళ్లాడో తెలియదు, ఎవరో కావాలని నా కొడుకుతో ఈ హత్య చేయించారు అని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ప్రజలనుంచి అనుకున్నంత మద్దతు లభించలేదు. విజయా రెడ్డి భర్త తొలివెలుగుతో మాట్లాడుతూ తన భార్య లంచం తీసుకునేది కాదని, తమకు ముందు నుంచే ఆస్తులు ఉన్నాయని చెప్పారు. పెద్ద అంబర్ పేట్ ఏరియాలో వివాదస్పద భూములు చాలా ఉన్నాయని, ఇక్కడ పని చేయలేను నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని గత 8 నెలలుగా కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పారు.
సురేష్ తల్లి తండ్రులు చెప్తున్న దాన్ని బట్టి సురేష్ కు ఎమ్మార్వోతో పని లేదు. ఎమ్మార్వో భర్త కథనం ప్రకారం లంచం అడగలేదు, వివాదాస్పద భూములు చాలా ఉన్నాయి.. ఈ నేపథ్యం లో సురేష్ తో ఈ హత్య చేయించింది ఎవరు, సురేష్ ఎమ్మార్వో పెట్రోల్ పోసి బయటకు వచ్చాక కారులో ఉన్న కొందరిలో మాట్లాడడు అని తెలుస్తుంది. వాళ్ళు ఎవరు, ఇద్దరు రాజకీయ నేతలు సైతం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు దాంట్లో నిజం ఎంత.. అసలు హత్యకు కారకులు ఎవరు అనేది మాత్రం సమాధి అయ్యింది.
పోలీసులు లోతైన విచారణ చేస్తే… కొంతైనా నిజం బయటపడే అవకాశం ఉన్నా, సురేష్ మృతి నిజాన్ని వధించింది అన్నది మాత్రం సుస్పష్టం.