లిక్కర్ స్కాంలో అరెస్టైన అభిషేక్ రావుకి మూడురోజుల కస్టడీ విధించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. టీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితుడిగా పేరు పొందిన ఈయనను ఆదివారం రాత్రే అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అభిషేక్ రావు రాబిన్ డిస్టిలరీస్ అనే కంపెనీని.. అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి నిర్వహిస్తున్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం వీరి కనుసన్నల్లోనే జరిగిందన్న అనుమానాలు సీబీఐ వ్యక్తం చేస్తోంది.
అభిషేక్ రావు అరెస్టుతో సీబీఐ ఇప్పటి వరకూ ముగ్గుర్ని అదుపులోకి తీసుకుంది. గతంలో ఆదివారం విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా ఆయన దర్యాప్తునకు సహకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో అరెస్టు చేసిన అనంతరం ఢిల్లీకి తరలించిన అధికారులు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ ఎదుట హాజరుపరిచారు అధికారులు. న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అప్పగించింది.
ఇండో స్పిరిట్ ఖాతా నుంచి అభిషేక్ అకౌంట్ లోకి రూ.3.85కోట్లు వచ్చినట్లు గుర్తించామని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఆ నగదు బదిలీకి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపలేదని, రెండు మూడు ఖాతాల నుంచి వచ్చిన డబ్బును వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టాడని వివరించింది. ఆయనకు ఆ కంపెనీల్లో షేర్లు ఉన్నాయని తెలిపింది. లిక్కర్ పాలసీ విషయంలోనూ అభిషేక్ వివిధ ప్రాంతాల్లో జరిగిన మీటింగ్ లకు హాజరైన విషయాన్ని అధికారులు వివరించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు 5 రోజుల సీబీఐ కస్టడీకి కోరారు.
సీబీఐ వాదనలు విన్న న్యాయమూర్తి 3 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఇటీవల పలుమార్లు అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు చేసింది. ఓ ఆడిటర్ ఇంట్లో అలాగే అభిషేక్ రావు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన పలు సంస్థల ఆఫీసుల్లోనూ సోదాలు చేసింది. అయితే, ఈడీ ఇంకా ఎలాంటి అరెస్టులు చేయకపోయినా.. సీబీఐ మాత్రం దూకుడుగా ఉంది. పరిస్థితి చూస్తుంటే ముందు సీబీఐ.. తర్వాత ఈడీ అరెస్టులు ఉంటాయని అనిపిస్తోంది.