చైనాలో కరోనా విజృంభిస్తోందన్న వార్తలు రోజుకు ఒకటి పుట్టుకొస్తోంది కానీ, అధికారికంగా చైనా నుంచి ఈ విషయంలో ఎలాంటి సమాచారమూ రావడం లేదు. అయితే, ఒక అంచనా ప్రకారం చైనాలో ఇప్పటికే 90 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుంది.పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. చైనాలో జనవరి 11 నాటికి కనీసం 90 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుంది. చైనా జనాభాలో 64% మంది ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ బారిన పడి ఉంటారు.
ఇప్పటివరకు అత్యధికంగా గాన్సు రాష్ట్రంలో కోవిడ్ బారిన పడ్డారు. ఈ రాష్ట్రంలో 91% మంది కరోనా బారిన పడ్డారని పెకింగ్ యూనివర్సిటీ వెల్లడించింది. యునాన్ రాష్ట్రంలో 84% మందికి, క్వింఘై రాష్ట్రంలో 80% మందికి కరోనా సోకిందని తెలిపింది. ఇప్పటివరకు పట్టణ, నగర ప్రాంతాల్లోనే విస్తరించిన కరోనా వైరస్ ఇకపై గ్రామీణ చైనాపై విరుచుకుపడనుందని చైనాకు చెందిన సీనియర్ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు జెంగ్ గ్వాంగ్ హెచ్చరించాడు.
చైనా చాంద్రమాన నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవడం కోసం లక్షలాదిగా చైనీయులు తమ స్వస్థలాలైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారని, అందువల్ల అక్కడ కూడా కరోనా వ్యాప్తి ప్రారంభమవుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్తరిస్తే, సరైన చికిత్స లభించకపోవడం వల్ల మరణాల సంఖ్య పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు.
ముఖ్యంగా వృద్ధులు, ఇతర వ్యాధిగ్రస్తులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనవరి 21 నుంచి చైనా ల్యూనార్ న్యూ ఈయర్ సెలవులు ప్రారంభమవుతాయి. ఈ పండుగ జరుపుకోవడం కోసం చైనాలో కోట్లాది మంది స్వస్థలాలకు ప్రయాణమవుతారు. ఇప్పటికే చాలామంది సెలవులు పెట్టి, స్వస్థలాలకు వెళ్లారు. ఈ పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో 200 కోట్ల ప్రయాణాలు జరుగుతాయని అంచనా.