లోక్ సభలో సుమారు నాలుగేళ్లుగా డిప్యూటీ స్పీకర్ లేరు. ఈ పదవిని నిర్వహించే వ్యక్తి లేకుండానే ఇన్నేళ్లూ సభ కొనసాగుతోంది. ఇది రాజ్యాంగవిరుధ్ధమని, డిప్యూటీ స్పీకర్ లేకుండా పార్లమెంట్ ను ఎలా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుండగా.. ఆయన లేనంత మాత్రాన సభా కార్యకలాపాలు ఏవీ ఆగిపోవడంలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ పదవికి సీనియర్ నేతను నియమించాల్సినంత తక్షణ అవసరమేదీ లేదని ఈ వర్గాలు దీన్ని తేలికగా పరిగణిస్తున్నాయి. ప్రస్తుత లోక్ సభ మొదటిసారి సమావేశమై దాదాపు మూడేళ్ళ ఏడు నెలలవుతోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 93, 178 ప్రకారం సాధ్యమైనంత త్వరగా ఇద్దరు ప్రిసైడింగ్ ఆఫీసర్లను సభ ఎన్నుకోవలసి ఉంటుంది. అంటే స్పీకర్ తో బాటు డిప్యూటీ స్పీకర్ కూడా ఉండితీరాలి. కానీ ఏ కారణం వల్లో స్పీకర్ ఓంబిర్లా.. 2019 జూన్ 17 న ఈ పదవికి ఎన్నికయినప్పటికీ. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఊసు మాత్రం లేదు. తన నియామకం జరిగినవెంటనే స్పీకర్.. తన డిప్యూటీ నియామకాన్ని చేపట్టవలసి ఉంది. నిబంధనల ప్రకారం ఇందుకు పూనుకోవలసి ఉంది. కానీ ఓంబిర్లా ఇందుకు యత్నించలేదు. ఈ నియామకానికి సంబంధించి ఆయన ఓ నిర్ణయం తీసుకోవలసి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వమే చొరవ చూపి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగేలా చూడాల్సిఉందని లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ. ఆచార్య అంటున్నారు. ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయ సాధనతో ఈ పదవికి వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పదవికి విపక్షాల నుంచి అభ్యర్థిని ప్రభుత్వం ఎన్నుకోవడం సంప్రదాయం. ఉదాహరణకు 2004-9 లో యూపీఏ-1 అధికారంలో ఉన్నప్పుడు శిరోమణి అకాలీదళ్ కు చెందిన చరణ్ జిత్ సింగ్ అత్వాల్ ఈ పదవిని నిర్వహించారు. అలాగే 2009-14 మధ్యకాలంలో బీజేపీకి చెందిన కరియా ముందా..లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఇక ప్రధాని మోడీ తొలి ప్రభుత్వ హయాంలో అన్నా డీఎంకేకి చెందిన ఎం. తంబిదురై ఈ పదవిని నిర్వర్తించారు. కానీ ఈ రెండో ప్రభుత్వ హయాం వచ్చేసరికి ఈ సంప్రదాయాన్ని పక్కన బెట్టినట్టు కనిపిస్తోంది. స్పీకర్ ఓంబిర్లాయే పూర్తిగా సభను తన చెప్పుచేతల్లో ఉంచుకోగలరని భావించిన ప్రభుత్వం.. ప్రతిపక్షాల నుంచి డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన గురించి ఆలోచించనైనా లేదు.
సభ ప్రొసీడింగ్స్ ప్రకారం బిల్లులన్నీ ఆమోదం పొందుతున్నాయని, సభలో చర్చలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు ఇక డిప్యూటీ స్పీకర్ ని తక్షణమే ఎన్నుకోవలసిన అవసరం ఏముందని కేంద్ర మంత్రి ఒకరు తేల్చి చెప్పారు. ఓంబిర్లా లేనప్పుడు వివిధ పార్టీలనుంచి ఎన్నిక చేసిన 9 మంది సభ్యుల పానెల్ లో సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారని, వీరు సభ నిర్వహణలో స్పీకర్ కి సహాయకారిగా ..ఆ కుర్చీలో తమ విధులు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కమిటీలో బీజేపీ నుంచి రమాదేవి, కిరీట్ పి. సోలంకి, రాజేంద్ర అగర్వాల్, కాంగ్రెస్ నుంచి కె. సురేష్, డీఎంకె నుంచి ఏ. రాజా, వైఎస్సార్ సీపీ నుంచి పీవీ. మిధున్ రెడ్డి తదితరులున్నారు. ఏమైనా సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఉండితీరాలని, ప్రధాని మోడీ ఈ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారని ఆచార్య పేర్కొన్నారు. విపక్ష సభ్యుల్లో ఎవరైనా ఈ పదవికి ఎన్నిక నిర్వహించాలని స్పీకర్ ని కోరుతూ తీర్మానాన్ని రూపొందించవచ్చునన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ కూడా ఇటీవల ఈ అంశాన్ని ప్రస్తావించారు. 1956 మార్చ్ లో విపక్ష అకాలీదళ్ కు చెందిన సర్దార్ హుకుం సింగ్ పేరును ఈ పదవికి నాడు నెహ్రూ ప్రతిపాదించారని, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. తనను విమర్శించే సింగ్ నే నెహ్రూ ఇందుకు ఎంపిక చేశారన్నారు.