ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీచేసింది. గత నెల 21న పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్ అంశాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటని.. ఆయనకు ప్రభుత్వం మెమో జారీచేసింది. దీనిపై వివరణ ఇస్తూ ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు.
తనపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలపై స్పందిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశానని ఆయన పేర్కొన్నారు. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లినప్పుడు.. ఆయా అంశాలపై స్పందించే అవకాశాన్ని ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని చెప్పారు. రూల్-17కి అనుగుణంగానే తాను గత నెల మీడియాతో మాట్లాడానని చెప్పుకొచ్చారు.
తాను గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్‌వేర్ వినియోగించలేదని మాత్రమే మీడియా సమావేశంలో చెప్పానని అన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్-6 ప్రకారం అధికారిక అంశాలపై వివరణ ఇవ్వవచ్చని తెలిపారు. నిబంధనల ప్రకారం.. అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండాలని ఆయన లేఖలో తెలిపారు.
అలాగే, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని నిబంధనల్లో ఉందని, తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చానే తప్ప ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయలేదని ఆయన లేఖలో స్పష్టం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే దానిపై స్పందించకూడదా? అని ఆయన ప్రశ్నించారు. అంతేగాక, ఆర్టికల్-21 ప్రకారం వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని, మీడియా సమావేశం నిర్వహిస్తున్న విషయంపై ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చానని ఏబీ తన లేఖలో పేర్కొన్నారు.