బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేసింది. 9000 మంది విద్యార్థులు గత 7 రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేపడుతుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పోలీసుల నిర్బంధంతో విద్యార్ధుల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యల విద్యార్ధలు చేస్తున్న ఉద్యమానికి ఏబీవీపీ అండగా ఉంటోందని స్పష్టం చేశారు ప్రవీణ్ రెడ్డి.
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీకి వెంటనే రెగ్యులర్ వైస్ చాన్స్ లర్ ను నియమించాలని.. లేదంటే మరో ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో 90% అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వెంటనే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్ వసతి కల్పించాలన్నారు. గత నాలుగేళ్లుగా విద్యార్ధులకు ఇవ్వాల్సిన ల్యాప్ టాప్ లను వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ రెడ్డి.
ఈ మేరకు ఏబీవీపీ ఉద్యమ కార్యాచరణను విడుదల చేశారుప్రవీణ్ రెడ్డి. జూన్ 21న రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల శవయాత్రలు, దగ్ధం చేసే కార్యక్రమాలు చేపట్టాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. జూన్ 22న రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. జూన్ 23న మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కార్యాలయాల ముట్టడించాలని పిలుపునిచ్చింది ఏబీవీపీ.