కాలేజీ యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకుందంటూ వరంగల్ నగరంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వెంటనే కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కేఎంసీ ముట్టడికి యత్నించారు. కాకతీయ వైద్య కళాశాల ప్రధాన గేటు వద్దకు వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని చక్కబెట్టేందుకు పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
ప్రీతి ఆత్మహత్యకు కారకులైన కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ తో పాటు హెచ్ఓడి నాగార్జున రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని హెచ్చరించారు.