వరంగల్ కేఎంసీ పీజీ స్టూడెంట్ ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ముందు ఏబీవీపీ నాయకులు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గత కొంత కాలంగా సీనియర్ స్టూడెంట్ వేధిస్తున్నాడని ప్రీతి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చినా.. చర్యలు తీసుకోలేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ ఆరోపించారు. మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యం అన్నారు.
గిరిజన విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీనియర్ విద్యార్థి డిగ్రీ రద్దు చేయాలన్నారు. అయితే ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు.. నిమ్స్ హాస్పిటల్ ముందు బహుజన విద్యార్థి సంఘాలు, బహుజన ముక్తి పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రీతి కేసులో ఏ1గా ప్రిన్సిపాల్, ఏ2గా సైఫ్ ను పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడుతున్నారు. ప్రీతి తండ్రి చెబుతున్నవి వాస్తవాలేనని.. ఆ దిశగా ఎందుకు విచారణ జరపడం లేదని డిమాండ్ చేస్తున్నారు.