- ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
- అధిక ఫీజు వసూళ్లను నియంత్రించాలి.
సర్కారు స్కూళ్లను బలోపేతం చేసి, ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అగడాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఈవో కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఆగడాలను నియంత్రించని ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రంగారెడ్డి DEO కార్యాలయం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని అట్టహాసంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. విద్యాసంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు కనీసం పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయకపోవడంపై ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో పాటు మధ్యాహ్న భోజనం అందించడంలోనూ నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకుండా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను ఆగం పట్టిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు టీఆర్ఎస్ సర్కారు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.