ప్రవీణ్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి
హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ వీధుల్లో కారులో తిప్పుతూ మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘాతుకానికి పాల్పడ్డ నిందితులని కఠినంగా శిక్షించాలి. నగరమంతా నిఘా నేత్రాలతో, మహిళలకు షీ టీమ్స్ తో రక్షణ కల్పిస్తున్నామని, శాంతి భద్రతల కల్పనలో తెలంగాణ దేశానికే ఆదర్శమని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి నేడు ఘటనపై ఎందుకు స్పందించడం లేదు.
సమాజం తలదించుకునేలా ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఘాతుకానికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిందుతుల్లో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల కుటుంబ సభ్యులు ఉండడంతో కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. నగరంలో ఇంత అమానవీయ ఘటన జరిగితే ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత దారుణం.
రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాదక ద్రవ్యాల నియంత్రించకపోవడం, రాష్ట్రంలో యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తూ అర్ధరాత్రి వరకు పబ్ లు నిర్వహిస్తున్నా, డ్రగ్స్ విక్రయిస్తున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదు. ఆదాయం పేరుతో తెల్లవారుజాము వరకు పబ్, బార్లకు అనుమతి ఇవ్వడం వంటి దుర్మార్గపు నిర్ణయాల వల్ల రాష్టంలో అనేక దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఘటనలో విషయం బయటకు పొక్కడంతో పోలీసులు హడావుడి చేస్తున్నారని.. నేతల ఒత్తిడితో కేసు నీరుగార్చే అవకాశం ఉన్నందున సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. బార్లు, పబ్ లపై ప్రభుత్వ నియంత్రణ చేపట్టి, మాదక ద్రవ్యాల మాఫియాను ఉక్కుపాదం మోపి అరికట్టాలి. నగరంలో జరుగుతున్న వరుస ఘాతుకలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.