తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాలుగా విశ్వ విద్యాలయాల్లో బోధనా, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకుండా, నిధులు విడుదల చేయకుండా యూనివర్సిటీలను, విద్యార్థులను, అధ్యాపకులను శత్రువులుగా భావిస్తూ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిన తెరాస ప్రభుత్వం నేడు వర్సిటీ నియామక బోర్డుతో ఒక కొత్త నాటకానికి తెరలేపిందని ABVP రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి విమర్శించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో నియామకాలంటూ ప్రణాళికా బద్దంగా ఎనిమిదేళ్లుగా నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం, 1991 ఆంధ్రప్రదేశ్ విశ్వ విద్యాలయాల చట్టం (తెలంగాణ ప్రభుత్వ అడాప్ట్ చేసుకున్న చట్టం) వ్యతిరేకంగా రాజ్యాంగ విరుద్ధంగా జీఓ 15 ను ఉల్లంఘించి, యూనివర్సిటీల స్వయంప్రత్తి ని కాలరాస్తూ నేడు క్యాబినెట్ ఆమోదంతో జీఓ నెంబర్ 16 ద్వారా ఎలాంటి చట్ట బద్దత లేని ప్రత్యేక నియామక బోర్డు ఏర్పాటు చేయడమంటే నియామక ప్రక్రియ మరింత ఆలస్యం చేసి, యూనివర్సిటీలను మరింత నాశనంచేసే దురుద్దేశం స్పష్టమౌతుందన్నారు.
యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర నియామకాల కోసం ఏర్పాటు చేసిన బోర్డులో యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ లను కనీసం పరిగణలోకి తీసుకోలేదంటే రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, యూజీసీ సెర్చ్ కమిటీ ద్వారా మీరు నియమించిన వైస్ ఛాన్సెలర్స్ పై మీకే నమ్మకం లేక విస్మరించడం దురదృష్టకరం అంటూ ఎద్దేవా చేశారు.
అధికార బలంతో వ్యవస్థలను తమ కబంధ హాస్తాల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఉద్యమ కేంద్రాలైన యూనివర్సిటీలను తీర్చిద్దాల్సిన ముఖ్యమంత్రి కక్ష్య పూరితంగా వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య అంటూ ధ్వజమెత్తారు. నియామకాలలో పారదర్శకత ప్రతిపాదనను ABVP తెలంగాణ శాఖ స్వాగతిస్తుందన్నారు.
కానీ యూనివర్సిటీ ద్వారా జరిగే నియామకాలలో పారదర్శకత లోపించిందంటూ దుష్ప్రచారంతో ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా యూనివర్సిటీల ప్రతిష్టతను శంఖిస్తూ…నియామక బోర్డు ద్వారా మాత్రమే పారదర్శకంగా జరుగుతాయని ప్రభుత్వ వితండ వాదన అసమంజసం. గతంలో గవర్నమెంట్ వ్యవస్థలోనూ పేపర్ లీకేజీ, ఉద్యోగ నియామకాల్లో తప్పుల తడకగా అనేక అవకతవకవలు,అక్రమాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు.
యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల భర్తీ కేవలం మల్టీబుల్ ఛాయిస్ ప్రశ్నలతో నియమించేది కాదని అకాడమిక్ విలువలు , పరిశోధన ప్రమాణాలతో వైస్ ఛాన్సెలర్, సీనియర్ ప్రొఫెసర్స్ తో జరగాల్సిన నియామకాలు ఐఏఎస్ అధికారుల బృందానికి అప్పగించడం సమంజసం కాదన్నారు.
ప్రభుత్వం యూనివర్సిటీలపై పక్షపాత వైఖరిని వీడి వెంటనే యూనివర్సిటీల స్వయంప్రత్తి ని కాపాడుతూ త్వరిత గతిన నియామకాలు చేపట్టాలని లేని పక్షంలో ABVP తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.