విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. అయితే ఇది పలు చోట్ల ఉద్రిక్తతలు దారితీసింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీ రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించకుకోవడంలేదని ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని, మెస్ ఛార్జీలను రూ. 15 వందల నుంచి 3 వేలకు పెంచాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి కూడా ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. అయితే, ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ కాస్తా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అలాగే హన్మకొండలో ఏబీవీపీ కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. అయితే, అక్కడికి వచ్చిన పోలీసులు విచక్షణరహితంగా వ్యవహరించారు. ఏబీవీపీ విద్యార్థులను ఎస్సై కాలుతో తన్ని, గొంతు నలిపి హత్యాయత్నం చేశారని వారు ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా ధర్నా చేసుకుంటే పోలీసులు అన్యాయంగా ప్రవర్తించారని వారు అంటున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.