ఢిల్లీ : బీజేపీలో జెంటిల్మన్ రాజకీయాలు నడిపిన నేతగా అరుణ్‌జైట్లీకి పేరుంది. వాజ్‌పేయ్ తరువాాత పార్టీలో అంత సౌమ్యుడని అంటుంటారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్య మంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వహించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ బీజేపీ విజయం సాధించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు. 1952 నవంబర్ 28న మహారాజ్ కిషన్ జైట్లీ, రత్నప్రభ దంపతులకు ఢిల్లీలో అరుణ్ జైట్లీ జన్మించారు. వారిది పంజాబీ హిందూ కుటుంబం. తండ్రి న్యాయవాది. ఢిల్లీలోని సెయింట్ జేవియర్స్ స్కూల్‌లో (1960- 1969) పాఠశాల విద్య అభ్యసించారు. 1973లో కామర్స్‌లో డిగ్రీ, 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో ఏబీవీపీ ఉద్యమాలలో పాల్గొన్నారు. 1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అరుణ్ జైట్లీ 1982 మే 24న సంగీత డోగ్రీని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సోనాలీ జైట్లీ, రోహన్ జైట్లీ. వారు ఇద్దరూ కూడా న్యాయవాదులే. తాత దగ్గర నుంచి వారిది న్యాయవాదుల కుటుంబం. 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1990లో ఢిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ ఉన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ)లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థంగా వ్యవహరించారు. 1991 నుంచి ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్ హోదా దక్కింది. 2009 జూన్ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.