ఓటుకు నోటు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆ కేసు విచారణను నెల రోజుల పాటు వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 15న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. రేవంత్ రెడ్డి సోమవారం ఈ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ తర్వాత ఏసీబీ కూడా కౌంటర్ దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణను జాప్యం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆయన అభ్యర్థనను తిరస్కరించాలని కోరింది. ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. ఓటుకు నోటు కేసు విచారణను వాయిదా వేయడంపై ఈనెల 15కు తమ నిర్ణయాన్ని వేసింది.
కాగా, మార్చి 8 నుంచి పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు ఉన్నందున.. తాను ఢిల్లీ వెళ్లి హాజరు కావాల్సి ఉందని అందుకే ఓటుకు నోటు కేసు విచారణను నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 8 వరకు వాయిదా వేయాలని ఆయన ఏసీబీ కోర్టును కోరారు.