లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అడ్డంగా దొరికిపోయారు. లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ అధికారులు పన్నిన వలలో చిక్కుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం కోసం ప్రజలను పీడిస్తున్న అధికారులపై ఏసీబీ నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో జనం నుంచి లంచం తీసుకుంటున్న వారిని వల పన్ని పట్టుకుంటున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.
ఇటీవల లంచం తీసుకుంటుండగా భూపాలపల్లి జిల్లాలో ఒక పోలీస్ ఎస్సైని, వరంగల్ లో ఓ ఎమ్మార్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు మున్సిపల్ శాఖ ఉద్యోగులను ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులు అడ్డంగా బుక్కైయ్యారు. ఓ పని కోసం స్థానికుడి నుంచి సర్కిల్ ఆఫీస్ లో రూ.15 వేలు నగదు లంచం పుచ్చుకుంటుండగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రబ్బాని, బిల్ కలెక్టర్ రంజిత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
రబ్బాని, రంజిత్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. కాశీబుగ్గ సర్కిల్ ఆఫీసులో సోదాలు జరుపుతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అవినీతి ఆరోపణలకు కేరాఫ్ గా మారిన జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు ప్రస్తుతం కలకలం సృష్టించాయి.