మహారాష్ట్రలో శివసేన పేరు, విల్లు, బాణం చిహ్నాన్ని సీఎం షిండే నేతృత్వంలోని సేన వర్గానికే కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై షిండే వర్గం హర్షం వ్యక్తం చేయగా.. మాజీ సీఎం, ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని సేన వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈసీ బీజేపీ ఏజంటుగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించింది. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కుతామని థాక్రే వెల్లడించారు.
అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ .. ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని అంగీకరించాలని, విల్లు, బాణం గుర్తును షిండే వర్గానికే వదిలేసి కొత్త చిహ్నాన్ని తీసుకోవాలని ఆయన థాక్రేకి సూచించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు పెద్దగా ప్రభావం చూపవని, పైగా ప్రజలు కొత్త చిహ్నాన్ని అంగీకరిస్తారని ఆయన చెప్పారు.
ఈసీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇక దానిపై చర్చ అనవసరమని, పాత గుర్తు ప్రజలపై ప్రభావం చూపే అవకాశం లేదని కూడా పవార్ అన్నారు. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల చిహ్నాన్ని ఎలా మార్చుకుందో గుర్తు తెచ్చుకోవాలన్నారు.
ఇప్పుడు మీరు కూడా నూతన చిహ్నాన్ని ఎంచుకోవాలని హితవు చెప్పారు. ఒకనాడు ఇందిరాగాంధీ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని, నాడు కాంగ్రెస్ కి.. ‘కాడితో ఉన్న రెండు ఎద్దుల’ గుర్తు ఉండేదని, అయితే పార్టీ దాన్ని కోల్పోయిందన్నారు. ఆ తరువాత కొత్త చిహ్నంగా హస్తం గుర్తును అంగీకరించిందని వివరించారు. దాన్ని చాలా ఏళ్లపాటు ప్రజలు ఆదరించారని శరద్ పవార్ పేర్కొన్నారు.