పరిపాలన గాలికొదిలేసి అబద్దాలు, అవాస్తవాలు ప్రచారం చేయటమే పనిగా వైసీపీ పాలన సాగుతుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. రాజధానిపై జగన్మోహన్‌రెడ్డి కట్టుకథలు బయటపడతాయనే ఉద్దేశంతోనే చంద్రబాబునాయుడు పర్యటనపై వైకాపా నేతలు బెంబేలెత్తుతున్నారని ఆరోపించారు. రాజధానికి గెజిట్‌లేదని, మ్యాప్‌లో చోటు లేదని వైకాపా నేతలు రోజుకో దుష్ప్రచారం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని పనులను అటకెక్కించారని ఆరోపించారు. బలహీనవర్గాల కోసం ఏర్పాటు చేసిన ఇళ్లు, విశాలమైన రహదారులు, వెలగపూడి సచివాలయం, అసెంబ్లీలు మీ కళ్లకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన విట్, ఎస్‌ఆర్‌ఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థలు చూస్తే మీకు కనువిప్పు కలుగుతుందని విమర్శించారు. ఈ నెల 28న చంద్రబాబునాయుడు పర్యటనలో నడిరోడ్డుపై ప్రజల సమక్షంలో మీ భాగోతాలను ఎండగడతామంటూ హెచ్చరించారు.