మద్యం మత్తు 11 మంది ప్రాణాలను హరించింది. పలువురుని ఆస్పత్రి పాలుజేసింది. తాగి వాహనాలు నడపకూడదని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికి కొంతమంది పెడచెవిన పెట్టి.. ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఎన్నో జీవితాలను ఆగం చేస్తున్నారు. శనివారం తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి డ్రైవర్ మద్యం మత్తే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తిరుపత్తూరు జిల్లా జువ్వాదిమలై ప్రాంతంలో ఓ వ్యాన్ లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 30 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వ్యాన్ అదుపు తప్పి లోయలోకి పడిపోయినట్టు భావిస్తున్నారు పోలీసులు. తొలుత ఓ స్తంభాన్ని ఢీకొన్న వ్యాన్, ఆపై లోయలోకి జారిపోయింది. ప్రమాద తీవ్రతను పరిశీలిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా పులియూర్ గ్రామస్థులుగా గుర్తించారు.
ఇక ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలని నిర్ణయించారు.